గుండాల, ఆళ్లపల్లి మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనచేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
శంభునిగూడెం పాఠశాలలో కొత్త తరగతి గదుల శంకుస్థాపన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో 1.80 కోట్లు ఖర్చుతో కొత్త తరగతి గదుల నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. పాఠశాల ప్రాంగణంలో సరస్వతి విగ్రహం, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తరగతి గదుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిధులు మంజూరు చేయించానని తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి కుటుంబం, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
జగ్గుతాండాలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన
గుండాల మండలం జగ్గుతాండాలో 30 లక్షల వ్యయంతో జగ్గుతాండా నుండి లక్ష్మీదేవిపల్లి వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ, ఉచిత కరెంట్, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాల వివరాలు తెలియజేశారు.
అనంతోగు పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం
ఆళ్లపల్లి మండలం అనంతోగు గిరిజన బాలికల పాఠశాలలో 1.80 కోట్లతో కొత్త తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యార్థులు క్రమశిక్షణగా చదువుకుని విజయాలు సాధించాలని సూచించారు.
పోతూరు గ్రామపంచాయితీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
ఆళ్లపల్లి మండలం పోతూరు గ్రామంలో 20 లక్షల వ్యయంతో గ్రామపంచాయితీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు నూతన వస్త్రాలు అందజేశారు.
అనంతోగు కస్తూర్బ గాంధీ పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మాణం
కస్తూర్బ గాంధీ బాలికల పాఠశాలలో 82.5 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హాస్టల్ వసతులను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఉపాధ్యాయులను ప్రోత్సహించారు.
కస్తూరిబా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
అనంతోగు కస్తూరిబా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి హాస్టల్ రికార్డులు, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడానికి వార్డెన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు
గుండాల మండలంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.