ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సంబరాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో, పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన సంవత్సర కాలంలో మహిళలకు పెద్దపీట వేసి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ 500 కే గ్యాస్, రైతులకు రూ 2 లక్షల రుణమాఫీ పథకాలు అందించబడుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వం అందజేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించారని అన్నారు. ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా సంక్షేమ పథకాల అమలులో వెనుకాడబోమని, బీఆర్ఎస్ నాయకులకు గ్రామాల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. “వరి వేస్తే ఉరే అన్న సన్నాసులు ఎక్కడ? సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో, క్వింటా కు 500 రూపాయల బోనస్ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడ?” అని నిలదీయాలని సూచించారు. మరో ఏడాదిలో అద్భుతమైన అభివృద్ధితో రాష్ట్రం దేశాన్ని గుర్తించేలా ఉంటుందని, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గౌరవించి, రానున్న పంచాయతీ ఎన్నికల్లో వారికి అవకాశాలు కల్పించి గెలిపించుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాయం రామ నరసయ్య, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.