మణుగూరులో ఘనంగా నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ చౌరస్తాలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్ అధ్యక్షతన ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి మహిళా సంఘాల నాయకులు, మహిళా సోదరీమణులు కోలాటాలతో పాయం వెంకటేశ్వర్లకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో మహిళా సంఘాల నాయకులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని 15 స్వయం సహాయక సంఘాలకు 2 కోట్ల రూపాయల చెక్కులను పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. మణుగూరు పట్టణ అభివృద్ధి కోసం 17 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వరద ముంపు నివారణ చర్యలలో భాగంగా కట్టు వాగు పూడిక పనులు పూర్తిచేశామని, అకాల వర్షాల వల్ల బాధపడిన 2500 కుటుంబాలకు 16,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు ఎమ్మార్వో రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్, AE సత్యనారాయణ, TPS భాస్కర్, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి.