మణుగూరులో మిడ్ డే మీల్స్ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో లైన్స్ క్లబ్ వారు నిర్వహించిన మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఆయన విద్యార్థులకు భోజనం వడ్డించి, ఈ కార్యక్రమం పరీక్షల కాలం ముగిసే వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లైన్స్ క్లబ్ లాంటి సంస్థలు విద్యార్థులకు భోజన సదుపాయాలు అందించటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు కోసం అత్యధిక నిధులు కేటాయించిందని, ముఖ్యంగా మన ఊరు మనబడి పథకంలో ప్రభుత్వ పాఠశాలలకు కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు సమానంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ కృషి కొనసాగుతుందని, విద్యార్థులు ఉన్నత విద్యను పొంది కుటుంబం మరియు దేశానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్య ప్రకాష్, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.