సింగరేణి సిఎస్‌ఆర్ తో సమాజానికి సేవ – పాఠశాలలకు ఫర్నిచర్ పంపిణీ
తేదీ: 03.01.2025
స్థలం: మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు సింగరేణి జిఎం కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతో పరిసర ప్రాంతాలు మరియు ప్రభావిత ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు హాజరై, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఫర్నిచర్‌ను అందజేశారు. సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ గారు ఎమ్మెల్యే పాయంను పూలగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే ప్రసంగం:ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, మణుగూరులో సింగరేణి సంస్థ స్థాపనతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజల జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. సింగరేణి సంస్థ సిఎస్‌ఆర్ నిధులు మరింత ప్రజల అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ సెంటర్‌ల స్థాపన చేయడంతో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక సహాయం:గ్రామస్తులకు న్యాయం జరిగే విధంగా మణుగూరు ఓసి విస్తరణ కొరకు కృషి చేయాలని, గ్రామ ప్రజలు సింగరేణి సంస్థకు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అలాగే, కంటి ఆపరేషన్ చేసిన వృద్ధులకు కళ్ళజోడులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:ఈ కార్యక్రమానికి మణుగూరు ఎమ్మార్వో రాఘవ రెడ్డి గారు, ఎంపీటీవో శ్రీనివాసరావు గారు, మణుగూరు సింగరేణి ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరినకి నవీన్ గారు తదితరులు పాల్గొన్నారు. ప్రభావిత ప్రాంతాల పాఠశాల ఉపాధ్యాయులు, సింగరేణి సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మణుగూరు అభివృద్ధి కోసం సింగరేణి సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయం అంటూ ఈ కార్యక్రమం ప్రజలలో ఉత్సాహాన్ని నింపింది.