పినపాక అభివృద్ధికి వేగం: మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి
హైదరాబాద్, మార్చి 31:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కీలక చర్యలు చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను సచివాలయంలోని ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
నియోజకవర్గంలోని మణుగూరు, పినపాక, అశ్వాపురం, కరకాగూడెం, గుండాల, అల్లపల్లి, బూర్గంపాడు మండలాల్లో మారుమూల ఏజెన్సీ గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ప్రధాన, అంతర్గత రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో ఎత్తైన వంతెనల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
మహిళా, శిశు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడు మండలాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న సుమారు 173 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో ప్రస్తావించారు. అలాగే ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ ఉపాధ్యాయుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, వారి వేతనాలను పెంచి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ వినతిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, రహదారులు, వంతెనలు, అంగన్‌వాడీ భవనాలు, ఉపాధ్యాయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ భేటీతో పినపాక నియోజకవర్గంలో రవాణా సదుపాయాల మెరుగుదల, శాశ్వత అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గణనీయమైన పురోగతి సాధ్యమవుతుందని స్థానిక నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
