ఆపదలో అండగా ప్రభుత్వం – లబ్ధిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
పినపాక మండలం భూపాలపట్నం పంచాయతీ పరిధిలోని బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన సుమారు ₹3,20,000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 8 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడటం తన బాధ్యతగా భావిస్తుందని తెలిపారు. వైద్య చికిత్సలు మరియు అత్యవసర అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేస్తున్న ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు ఎదురైనప్పుడు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, స్థానిక సర్పంచ్ స్వప్న, ఉప సర్పంచ్ శిరీష, సెక్రటరీ చంద్రకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.